రాయచోటి ACB సోదాల నేపధ్యంలో ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించిన అధికారులు.
అక్రమాస్తుల కేసులో ACBకి చిక్కిన సహాయ బీసీ సంక్షేమ అధికారి నివాసాల్లో సోదాలు నిర్వహించి భారిగా ఆస్తులను గుర్తించారు అధికారులు.
శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి డివిజన్, కదిరికి చెందిన సహాయ బీసీ సంక్షేమ అధికారి పురం బాలాజీపై ఫిబ్రవరి 5న ACB వల పన్ని పట్టుకున్న (trap case) ఘటన అనంతరం, ఆయన తన చట్టబద్ధమైన ఆదాయ వనరులకు మించి ఆస్తులను కూడగట్టారన్న ఆరోపణలపై అనంతపురం ACB అధికారులు మరొక కేసును నమోదు చేశారు. అవినీతి నిరోధక చట్టం లోని సెక్షన్ 13(1)(b)తో కలిపి సెక్షన్ 13(2) కింద ఈ కేసును Cr. No. 05/RCA-ATP/2026గా నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడు పురం బాలాజీకి చెందిన రాయచోటి, కదిరి పట్టణాలలోని నివాసాలతో సహా మొత్తం నాలుగు ప్రదేశాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల సమయంలో, ఆస్తి పత్రాలతో సహా నేరారోపణకు దారితీసే పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వెలుగుచూసిన ఆస్తులలో 11 ఇంటి స్థలాలు, 2 ఇళ్లు, రూ.21,80,140 నగదు, రూ. 26.5లక్షల విలువైన ఆభరణాలు, ఒక కియా సెల్టోస్ కారు, ఒక మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కారు, రెండు మోటార్ సైకిళ్లు, బ్యాంకు ఖాతాల్లో రూ.37.50 లక్షల నిల్వలు, రూ. 13 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, రూ.3.60కోట్లు విలువైన గృహోపకరణాలు ఎసీబీ అధికారులు గుర్తించారు.. ఈ ఆస్తులు నిందితుడు, అతని భార్య, ఇద్దరు కుమార్తెలు తండ్రి పేర్ల మీద ఉన్నట్లు గుర్తించారు. వీటిలో అత్యధిక ఆస్తులు పూర్వపు YSR కడప జిల్లా పరిధిలోనే గుర్తించారు. దర్యాప్తులో భాగంగా మరిన్ని సోదాలు కొనసాగుతున్నాయి. నిందితుడిని చట్టపరమైన విధానాల ప్రకారం అరెస్టు చేసి, కర్నూలులోని ACB కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరు పరుచనున్నారు.
నిందితుడైన పురం బాలాజీ, 1987వ సంవత్సరంలో హాస్టల్ సంక్షేమ అధికారి (Grade-II)గా నియమితులై, కడప జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పనిచేశారు. తర్వాత రాయచోటిలో పనిచేస్తున్న సమయంలో 2011లో ఆయన హాస్టల్ సంక్షేమ అధికారి (Grade-I) పదవికి పదోన్నతి పొందారు; అక్కడ కొంతకాలం కొనసాగిన తర్వాత, మట్లి లలో పనిచేశారు. ఆ తర్వాత 2016వ సంవత్సరంలో ఆయన సహాయ బి.సి. సంక్షేమ అధికారిగా పదోన్నతి పొంది తిరుపతి అర్బన్ డివిజన్‌కు బదిలీ అయ్యారు. 2023 జూన్ 1 నుండి కదిరి డివిజన్‌లో పనిచేస్తున్నారు.
Post A Comment:
0 comments: