*-ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకంను ఎక్కువగా విస్తరించాల్సి ఉంది*
*-నిబంధనలకు అనుగుణంగా విద్యా రుణాలు ఇవ్వని బ్యాంకర్లపై చర్యలు తీసుకోవాలి*
*-ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విద్యార్థులకు రుణ లభ్యత తక్కువగా ఉంది.. పల్నాడు వంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఇది ఎక్కువ*
*ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు కేంద్రం అండగా నిలవాలి*
*-లోక్ సభలో కేంద్రాన్ని ప్రశ్నించిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు*
*-పిఎం విద్యాలక్ష్మి పథకం డిమాండ్ ఆధారితమైనది.. నిర్దిష్ట కోటా ఏమీ లేదు : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్*
---------------
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న (బిపిఎల్ ), ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యనభ్యసించటంలో వడ్డీ రాయితీ రుణాల లభ్యత ప్రస్తుతం తక్కువగా ఉందని, వీటిని మరింత విస్తరించాలని, పూచీకత్తు లేని రుణాలు పొందటంలో నిబంధనలు ఉన్నప్పటికీ, పూచీకత్తు కోరుతున్న బ్యాంకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఈరోజు లోక్ సభలో డిమాండ్ చేశారు. రుణాల పంపిణీలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ, రేషన్ కార్డుల వినియోగంతో సహా అర్హత ప్రమాణాలను సరళీకరించాలని ఎంపీ కోరారు.
భారతదేశంలో ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి (గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో) సుమారు 29.5%కి చేరుకున్నప్పటికీ, కేవలం 4% మంది విద్యార్థులు మాత్రమే రుణాలను పొందగలుగుతున్నారని, పల్నాడు వంటి వెనుకబడిన ప్రాంతాలలో ఈ లభ్యత మరింత తక్కువగా ఉందని ఎంపీ కృష్ణ దేవరాయలు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం కింద దేశవ్యాప్తంగా వడ్డీ రాయితీ కింద ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్యను లక్షకు పరిమితం చేశారన్నారు. ఉన్నత విద్యలో దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 3,429 సీట్లను మాత్రమే కేటాయించారని, ఇది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్యా అవకాశాలను గణనీయంగా పరిమితం చేస్తోందని, దీన్ని విస్తరించాలని కోరారు. దీనిపై విద్యాశాఖ సహాయ మంత్రి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. పిఎం విద్యాలక్ష్మి పథకం అనేది డిమాండ్ ఆధారితమైనదని,, దీనికి రాష్ట్రాలు, జిల్లాల వారీగా గానీ నిర్దిష్ట కోటా ఏమీ లేదని, ఇది విస్తృత శ్రేణి విద్యాసంస్థలలోని అర్హులైన విద్యార్థులందరికీ అందుబాటులో ఉంటుందని
పేర్కొన్నారు. ఈ పథకం మితమైన వడ్డీ రేట్లతో, తిరిగి చెల్లింపు నిబంధనలతో హామీ అవసరం లేని రుణాలను అందిస్తుందని, దీనిపై విస్తృత అవగాహన కల్పించి, పథకాన్ని వినియోగించుకోవాలని మంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుత నిబంధన లక్ష మంది లబ్ధిదారుకే ఉన్నప్పటికీ, డిమాండ్‌ను బట్టి దీనిని సమీక్షించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ పథకం కింద ఎటువంటి పూచీకత్తు అవసరం లేదని కూడా మంత్రి పునరుద్ఘాటించారు.
Post A Comment:
0 comments: