యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌డ‌మే మా ల‌క్ష్యం...

* రూ.500 కోట్ల పెట్టుబ‌డితో హెచ్ సీ రోబోటిక్స్ విస్త‌ర‌ణ‌

* ఈ ఏడాది కొత్త‌గా 500 మందికి.. 3 ఏళ్ల‌లో 2వేల మందికి ఉద్యోగాలు 

* ద్వితీయ‌, తృతీయ శ్రేణి న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌కు ఐటీ కంపెనీలు

* మేం పెట్టుబ‌డులు తీసుకొస్తుంటే ప్ర‌తిప‌క్షాలు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాయి

* చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు అండ‌గా ఉంటాం.. బ‌కాయిలు చెల్లిస్తాం

* రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధ‌ర్ బాబు 


రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్స‌హించి, తెలంగాణ యువతకు ఉపాధి కల్పించడమే ప్ర‌జా ప్ర‌భుత్వ లక్ష్యమని *రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్ప‌ష్టం చేశారు. 


రాష్ట్రం లో మరో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సెంటిలియాన్ నెట్ వ‌ర్క్స్ కు చెందిన హెచ్ సీ రోబోటిక్స్ ముందుకొచ్చిన‌ట్లు వివ‌రించారు. ఆ వివ‌రాల‌ను శుక్రవారం కంపెనీ ప్రతినిధులతో కలిసి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. "హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా సెంటిలియాన్ నెట్ వ‌ర్క్స్, హెచ్ సీ రోబోటిక్స్ తొమ్మిది దేశాల్లో డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ సాఫ్ట్ వేర్, టెలి కమ్యూనికేషన్, రోబోటిక్స్, విమాన రక్షణకు సంబంధించిన సాఫ్ట్ వేర్ అభివృద్ధితో పాటు పలు రంగాల్లో సేవలు అందిస్తూ.. 2వేల మందికి ఉపాధి క‌ల్పిస్తుంది. 

తాజాగా మ‌రో రూ.500 కోట్లు పెట్టేందుకు ముందుకొచ్చారు. ఫ‌లితంగా ఈ ఏడాది 500 మందికి ఉద్యోగావ‌కాశాలు ద‌క్కుతాయి. ఈ సంఖ్య మూడేళ్ల లో 2వేల‌కు చేరుతుంది" అని అన్నారు. " ఇప్ప‌టీ వ‌ర‌కు ఐటీ రంగంలో పెట్టుబ‌డుల‌న్నీ హైద‌రాబాద్ కే ప‌రిమిత‌మ‌య్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్ర‌తిభ గ‌ల యువ‌త‌కు ఉద్యోగాల‌ను క‌ల్పించాల‌నే సంక‌ల్పంతో ద్వితీయ‌, తృతీయ శ్రేణి న‌గ‌రాల‌కు ఐటీ రంగాన్ని విస్త‌రించాల‌ని సంక‌ల్పించాం. అందుకు అనుగుణంగా ప్ర‌ణాళిక‌లు రూపొందించి అమ‌లు చేస్తున్నాం. ఆ దిశ‌గా పారిశ్రామికవేత్త‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నాం. సెంటిలియాన్ నెట్ వ‌ర్క్స్ సంస్థ ఇప్ప‌టికే త‌మ కార్యక‌లాపాల‌ను క‌రీంన‌గ‌ర్ లో ప్రారంభించింది. మ‌రికొన్ని సంస్థ‌లు కూడా ముందుకొచ్చాయి" అని వివ‌రించారు. "రాష్ట్రంలో చిన్న, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లకు అండ‌గా ఉంటాం. వీరికి రావాల్సిన ప్రోత్సాహాకాలు రూ.4500 కోట్లు 2016 నుంచి పెండింగ్ లో ఉన్నాయి. మేం అధికారంలోకి రాగానే  ఈ బకాయిల‌ను చెల్లించేందుకు చొర‌వ తీసుకున్నాం. స‌హేతుక కార‌ణాలు చూప‌క‌పోతే గ‌తంలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు గ‌తంలో కేటాయించిన భూముల‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం. ఇతర అవసరాలకు భూములను వినియోగిస్తున్న వారిపై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటాం. ప‌రిశ్ర‌మ‌ల పున‌రుద్ధ‌ర‌ణ‌కు గ‌తంలో ఏర్పాటు చేసిన‌ హెల్త్ క్లినిక్ పై ప్ర‌త్యేక అధ్య‌య‌నం చేస్తున్నాం. దీని వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని భావిస్తే అధిక నిధులు కేటాయించి య‌థావిధిగా కొన‌సాగిస్తాం" 

అని చెప్పారు. "రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు అనువైన వాతావ‌ర‌ణం ఉంది. గ‌తేడాది దావోస్ లో చేసుకున్న 18 ఒప్పందాల్లో 17 ప‌ట్టాలెక్కాయి. 10 ఒప్పందాల పురోగ‌తి 50 శాతం కంటే ఎక్కువ‌గా ఉంది. కేవ‌లం ఒప్పందాలు చేసుకుని రావ‌డమే కాదు.. వాటిని కార్యరూపంలోకి తెచ్చేందుకు ప్ర‌త్యేక చొర‌వ తీసుకుంటున్నాం. ఈ ఏడాది కూడా మేం రూ.1.8 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నాం. మేం ఉద్యోగాల‌ను క‌ల్పించేందుకు పాటు ప‌డుతుంటే.. ప్ర‌తిప‌క్షాలు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూ పారిశ్రామిక‌వేత్త‌ల‌ను భ‌య‌పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు" అని ఆరోపించారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నడూ భూసేకరణ పనులను అడ్డుకోలేదు. రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచించాం. ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడుతూ అభివృద్ధికి అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నాయి. మాకు రాజ‌కీయాలు కాదు..రాష్ట్రాభివృద్ధే ముఖ్యం. పారిశ్రామికాభివృద్ధికి గ‌త‌ ప్ర‌భుత్వం తీసుకున్న పాల‌సీలను కొన‌సాగిస్తాం" అని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్  సెంటిలియాన్ నెట్ వ‌ర్క్స్ ఛైర్మ‌న్‌, ఎండీ వెంక‌ట్‌, డైరెక్ట‌ర్ రాధా కిషోర్, ఆ సంస్థ ఇండియా ఆపరేషన్స్ హెడ్ సుధాకర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: