ప్రపంచ భాషలలో తెలుగు భాషదే అగ్రస్థానం... జాతీయ రచయిత కళారత్న విహారి....
ఆంధ్ర సారస్వత సమితి మరియు తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య ల సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది పురస్కరించుకుని 'తెలుగు_ పద్యం పాట కవిత : చదువుదాం విందాం ఆస్వాదిద్దాం' అనే సాహిత్య కార్యక్రమం మచిలీపట్నం బాలాజీ విద్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర సారస్వత సమితి వ్యవస్థాపకులలో ఒకరు అయిన నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారత్న అవార్డు గ్రహీత జాతీయ రచయిత శ్రీ విహారి మాట్లడుతూ ఎన్నో అంశాలలో ప్రపంచ భాషలలో తెలుగు భాషదే అగ్రస్థానం అన్నారు. ఆంధ్ర సారస్వత సమితి పుట్టుపూర్వోత్తరాలను సమితి భాషకు చేసిన సేవలను సభ్యులకు తెలియజేశారు. ఆత్మీయులను కలుసుకోవడం, ముచ్చటించటం జాతీయస్థాయి వేదికలలో మాట్లాడినప్పుడు వచ్చే ఆనందం కన్నా మిన్నయని అన్నారు. అతి చిన్న స్థాయి నుంచి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని నిలబడి సారస్వతానికి 60 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఆంధ్ర సారస్వత సమితి అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థయని తెలియజేశారు.
ఆంధ్ర సారస్వత
సమితి అధ్యక్షులు శ్రీ కొమరగిరి చంద్రశేఖర్ అధ్యక్షతన, ప్రముఖ న్యాయవాది సాహితీమిత్రులు అధ్యక్షులు ఆంధ్ర సారస్వత సమితి ఉపాధ్యక్షులు అయిన శ్రీ లంకిశెట్టి బాలాజీ నిర్వహణ సారధ్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమ తొలి పలుకులలో అధ్యక్షులు శ్రీ కొమరగిరి చంద్రశేఖర్ మాట్లాడుతూ చిన్నగా అనుకున్న నేటి సభ ఉన్నతమైన సభగా చాలా బరువైన సభగా మారిందని ముగ్గురు కళారత్న పురస్కార గ్రహీతలు ఈ కార్యక్రమానికి రావడం మా రెండు సంస్థలకు అత్యంత ఆనందాన్నిచ్చిందన్నారు.
సభా నిర్వహణ సారథ్యం వహించిన శ్రీ లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ 50 సంవత్సరముల క్రితం ఆంధ్ర సారస్వత సమితికి అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేసిన శ్రీ విహారి , గుత్తికొండ సుబ్బారావులిరువురికీ ఒకేసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి హంస_ కళారత్న అవార్డు రావడం వీరిద్దరూ గురు శిష్యులు కావడం వీరికి ముందే వీరి శిష్యుడు ప్రపంచ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రముఖ రచయిత డాక్టర్ జీవీ పూర్ణచంద్ గారికి 2017 లోనే హంస కళారత్న అవార్డు రావడం పూర్ణచందు గారు కూడా మన ఈ కార్యక్రమానికి హాజరవ్వడం ఎంతో విశేషం అన్నారు.
తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు పైడిపాటి రామదేవ్ గారు సభను ఉద్దేశించి చిరు సందేశం ఇస్తూ తెలుగు భాష యొక్క ప్రత్యేకతలను తెలియజేశారు. సమాఖ్య యొక్క తెలుగు పుస్తక సంకలనాన్ని 2012 ప్రపంచ తెలుగు మహాసభల్లో పంచినవైనాన్ని సభ్యులకు వివరించారు. తెలుగు అనే ఈ చిరు పుస్తకం ఎప్పటికి ఐదు సార్లు ముద్రించి తెలుగు భాషాభిమానులకు కానుకగా ఇవ్వటం జరిగిందన్నారు.
ఆత్మీయ అతిథిగా విచ్చేసిన జి.వి పూర్ణచంద్ మాట్లాడుతూ వారికి గురువులైన విహారి, గుత్తికొండ సుబ్బారావు గార్ల జీవన రేఖలను వారు పడిన కష్టసుఖాలను, గౌరవాలను అన్నింటినీ సభ్యులకు కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఎంత పెద్ద గ్రంథాలలో అయినా ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల పద చిత్రాల పద్యాలు ఉంటాయని అటువంటిది పూర్తి రామాయణం పద చిత్రాలతో పదచిత్ర రామాయణం రచించడం ఒక విహారి గారికే సాధ్యపడిందని, _తన రచనలు పక్కనపెట్టి రాష్ట్రంలో, దేశంలో తెలుగులో ఎక్కడ పుస్తకం అచ్చయినా అది తనదేనని సంబరపడిపోయే మహనీయుడు గుత్తికొండ సుబ్బారావు అని సభ్యులకు తెలియజేశారు.
ప్రముఖ విద్యావేత్త శ్రీ దిట్టకవి వెంకటేశ్వరరావు కళారత్న పురస్కార గ్రహీతలను సభా నిర్వాహకులను తెలుగు పుస్తకంలోని పద్యాలను గానం చేసి సభ్యులను అలరించిన తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య సహాధ్యక్షులు ప్రముఖ హరికథా భాగవతార్ మడమల రాంబాబు గారిని అభినందించారు. సాహిత్య రంగంలో మచిలీపట్నం అందే అగ్రస్థానం అని ఎందరో కవులు రచయితలు మచిలీపట్నం నుండి జాతీయస్థాయికి ఏదిగారని అన్నారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హంస _ కళారత్న పురస్కార గ్రహీత శ్రీ గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ పురస్కారం అందుకున్న తర్వాత తాను హాజరైన తొలిసభయిదియని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు యువత హాజరయ్యేలా చూడాలని సంస్కృతిని అందిపుచ్చుకునే, అభివృద్ధి చేసే తరం రావాలని ఆకాంక్షించారు. 50 సంవత్సరాల క్రితం విహారి గారు అధ్యక్షుడిగా ఉండగా తాను కార్యదర్శిగా నిర్వహించిన కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకుంటూ నేను కళారత్న పొందటం కాదు గురువుగారైన విహారి గారితో కలిసి కళారత్న పొందటం మహదానందంగా ఉందన్నారు.
యువకవి డి శ్రీహరి, డా.ఓలేటి ఉమా సరస్వతి, కారుమూరి రాజేంద్రప్రసాద్, మేడిశెట్టి యోగేశ్వరరావు, గురజాడ రాజరాజేశ్వరి తదితరులు తెలుగుపై స్వీయ కవితలు చదివి వినిపించారు.
ఈ కార్యక్రమంలో త్రిమూర్తులుగా భాసిల్లిన కళారత్న పురస్కార గ్రహీతలను, కార్యక్రమంలో సందేశముల మధ్య మధ్యలో తన గానంతో అలరించిన మడమల రాంబాబు గారిని ఇరు సంస్థలూ ఘనంగా సత్కరించాయి. కవులకు జ్ఞాపికలు అందజేయడం జరిగింది.
ఆంధ్ర సారస్వత సమితి కార్యదర్శి అప్పినేడి పోతురాజు వందన సమర్పణతో ముగిసిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సంఘ సేవకులు కరెడ్ల సుశీల, వై ఎన్ వి సురేష్ బాబు, లంక రాజేష్, వెనిగళ్ళ మహేశ్వరరావు, ఉమ్మిటి విద్యాధర్, శివాజీ గణేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.
Post A Comment:
0 comments: