*పితృ తర్పణాలకు శ్రేష్టం దక్షిణాయనం*

*ఈ రోజు జూలై 16 మంగళవారం నుండి దక్షిణాయనం ప్రారంభం సందర్భంగా...*

*సంవత్సరానికి రెండు ఆయనాలుంటాయి. అవి ఉత్తరాయణం, దక్షిణాయనం. ఆయనం అంటే పయనించడం. సూర్యుడు దక్షిణం వైపుకి పయనిస్తున్నపుడు దక్షిణాయనం, ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు దక్షిణం వైపు, మరో ఆరు నెలలు ఉత్తరం వైపు పయనిస్తాడు. భూమిపై రాత్రి పగలు ఉన్నట్టుగానే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. సూర్యుడు దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం దేవతలకి రాత్రి. ఉత్తరం వైపుకి పయనిస్తున్నంత కాలం పగలు అని శాస్త్రాలు అభివర్ణించాయి.*

*ఈ కాలగణనం భారతదేశంలో ప్రాచీన కాలంనుండి వస్తోంది. పన్నెండు రాశుల్లో సూర్యుని ప్రవేశాన్నిబట్టి ప్రతినెలా సంక్రాతి వస్తుంది. ఆ పరంపరలో మకరరాశిలో సూర్యుని ప్రవేశం 'మకర సంక్రాతి'గా నాటినుండి ఉత్తరాయణ పుణ్యకాలంగా ఆచరిస్తారు. అదేవిధంగా కర్కాటక రాశిలో సూర్యుని ప్రవేశాన్ని దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంగా లెక్కిస్తారు. దీనినే కర్కాటక సంక్రాంతి అని కూడా అంటారు. కర్కాటక రాశిలో సూర్యుడి ప్రవేశం నాటినుండి మకరరాశిలో సూర్యుడి ప్రవేశం వరకు మధ్య కాలాన్ని దక్షిణాయనం అంటారు.*

*ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుండి జూలై 15 వరకు ఉత్తరాయణం, జూలై 16 నుండి జనవరి 14 వరకు దక్షిణాయనం అని అంటారు. దక్షిణాయనంలో పిండ ప్రదానాలు, పితృ తర్పణాలు ఇవ్వడం, సాత్వికాహారం సేవించడం శుభ ఫలితాలనిస్తాయి. సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6 గంటల 49 నిముషాలు పుణ్యకాలంగా, రెండు గంటల 16 నిమిషాలు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సమయంలో స్నాన, దాన, జపాదులు విశేష ఫలితాలనిస్తాయి.*

*దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది. కాబట్టి జీవులలో రోగనిరోధకశక్తి తగ్గిపోయి అనారోగ్యాల పాలవుతారు. అందుకే ఈ కాలంలో బ్రహ్మచర్యం, ఉపవాసాలు, పూజలు, వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఎలా చూసిన దక్షిణాయనంలో చేసే జప, దాన, పూజల వలన ఆరోగ్యం, అధ్యాత్మిక ఆనందంతో పాటు దైవానుగ్రహం లభిస్తుంది. పితృదేవతలు తమ వారసులు ఇచ్చే శ్రాద్ధాలు, విశేష తర్పణాలను స్వీకరించేందుకు దక్షిణాయనంలోనే భూమిపైకి వస్తారని చెబుతారు. ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహాళయ పక్షాలు వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది. ఈ కాలంలో ధ్యానం, జపాలు, పవిత్ర నదుల్లో స్నానాలు, అన్నదానం, తిల దానం వస్త్ర దానం, విష్ణు పూజ, విష్ణు సహస్రనామ పారాయణ, సూర్యారాధన, ఆదిత్య హృదయ పారాయణం చేస్తే అవి శరీరానికి, మనసుకు మేలు చేస్తాయని, పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.*

*దీక్షలు, పండుగలు వంటివి దక్షిణాయనంలో ఎక్కువగా వస్తాయి. దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ట, గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహంలాంటి కార్యాలు చేయడం తక్కువ. భైరవ, వరాహ, నరసింహ, మహిషాసుర మర్దిని, దుర్గ లాంటి ఉగ్ర దేవతా మూర్తులను ప్రతిష్ఠించవచ్చని శాస్త్రం చెబుతోంది.*

          *ఆధ్యాత్మికం ఆనందం*
☘️🌟☘️ 🙏🕉️🙏 ☘️🌟☘️
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: